అక్కరకు రాని చెట్టు - ఆసరా ఇవ్వని కొడుకు -hemabobbu

posted Sep 6, 2013, 6:26 PM by A Billion Stories
మా పుట్టింట్లో పెద్ద మునగచెట్టు ఉండేది. చెట్టు నిండుగా చివుర్లు, పూతలతో కళకళలాడుతుండేది. ఇంట్లో అంత ఎసరు పెట్టుకుంటే చాలు, కూరకు కమ్మని మునగ పప్పు, మునగ చారు తయారుగా ఉండేవి. మేమందరము పనికి పోయి కష్టపడి ఇంటికి రాగానే మా అమ్మ పెట్టిన వేడివేడి రాగిసంగటి, ఎండుచేపలు వేసిన మునక్కాయ పులుసును లొట్టలు వేసుకొంటూ తినేవాళ్ళం.

నాకు పెండ్లయినాక ఎప్పుడైనా పుట్టింటికి పోయినప్పుడు తప్పనిసరిగా ఆ లేత చిగురులను తాలింపు పెట్టించేదాన్ని. కమ్మని ఆ రుచి నాకు ఇంకెక్కడా తగలలేదు.

మేము టౌన్లొ చిన్న ఇల్లు కట్టగానే నేను ఆ మునగ కొమ్మను తెచ్చి మా పెరట్లొ పాతాను. అప్పటికి నాకొడుకు ఇంకా చేతికి అందిరాలేదు. టౌన్లొ ఏది కొనాలన్నా కష్టమే. నాలుగు కడుపులు నింపడానికి నేను, నా మొగుడు చానా అవస్థలు పడ్డాము.

మా ముసలాడు చూస్తే నాలుగు పదులు రాకనే అదేదో మాయజారి జబ్బుతో శక్తిలేనివాడై పనికిపోక ఇంట్లో కూర్చోని తినబెట్టినాడు. నాలుగు చేతులు ఆడుతుంటేనే కష్టమైన రోజుల్లొ, నేనొక్కటే పనికి పోబెట్టినాను. కొడుకు చేతికి ఎప్పుడు అందివస్తాడా అని చూస్తున్నా.

నేను మా పెరట్లో నాటిన మునగకొమ్మ కళకళలాడుతూ పెరగడం మొదలు పెట్టింది. ఎప్పుడెప్పుడు అది ఇగుర్లు యేస్తుందా, పూత పూస్తుందా అని దానికి చికెన్ కడిగిన నీళ్ళు పోస్తూ, రోజు టీ కాచాక మిగిలిన రొట్ట వేస్తూ అనుకునేదాన్ని. అది ఏపుగా పెరగడం మొదలు పెట్టింది.నా కష్టం చూసి పైవాడు ఓర్వలేక కాబోలు నా కొడుక్కి చదువు బాగ వంటబట్టింది. వాడు నా కష్టంతో, వాడి స్కాలర్షిప్పులతో చదువుకోబెట్టినాడు.

నా కొడుకు చదువులొ చురుగ్గా ఉండి ఇంజనీరింగ్లో సీటు తెచ్చుకున్నాడు. నేను ఆ పని ఈ పని అని చూడక అన్ని పనులకూ వెళ్ళి ఇల్లు గడిపేదాన్ని, అందులోనే నాలుగు డబ్బులు నా కొడుకు పుస్తకాలకోసం, పెన్నులకోసం దాచేదాన్ని. మా మునగచెట్టు మా పుట్టింట్లోకంటే చురుగ్గా మా పెరట్లో పెరగబెట్టింది. దాని కొమ్మలు నాలుగేండ్లు తిరక్కుండానే అల్లుకుపోయాయి. కాని కొమ్మలు మా పెరటిని దాటి పక్కింటి ఇంటిపైకి పెరగబెట్టాయి. వాళ్ళు మా మునగ రుచి మరిగి పూతను కూడా దుయ్యబెట్టినారు.

నా కొడుకు కాలేజి చదువు పూర్తికాకముందే, వానికి అదేదో విప్రో అనే పెద్ద కంపనీలో ఉద్యోగం వేసారు. వానికి నలబైవేల జీతమని చెప్పినాడు. మా బందువులందరూ నీకేమమ్మ కొడుకు ఎదిగి వచ్చాడు, ఇక నీ కట్టం తీరిపోతాదిలే అనబెట్టినారు.

ఆడ చూస్తే మా మునగచెట్టు పిందె బట్టినాది. ఎప్పుడెప్పుడు పిందె కాయావుతుందా అని చూస్తాన్నా. మా పెరటి మునక్కాయ పులుసు లో చేపలు కూరి జొన్న రొట్టెలతో తిన్నామంటే ఆ రుచి అదేదో ఐదు స్టార్ల హోటల్ లో కూడా ఉండదు.


నా కొడుకు ఒకరోజు నాతో మాట్లాడుతూ తానొక అమ్మాయిని ప్రేమించానని, వాళ్ళు మనకంటే పెద్ద కులపోళ్ళు అయినా తమ పెళ్ళికి ఆ అమ్మాయి తల్లితండ్రులు అంగీకరించారని చెప్పాడు. తాను ఆ అమ్మాయినే పెళ్ళాడతానని చెప్పాడు. వాళ్ళ పెద్దోళ్ళు మంచి రోజు చూసుకొని మన ఇంటికి వస్తామన్నారని చెప్పాడు.

ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, వాడి మనస్సుకు నచ్చిన మనువాడతానని అంటే ఎందుకు కాదనాలని అనుకొన్నాము. వాడి అక్క పెండ్లి కూడా చేసేసాము కదా, ఇక వాడి పెండ్లె కదా చేయాల్సిందని, వాడి మనస్సుని ఎందుకు కష్టపెట్టడమని ఒప్పుకొన్నాము. మా ముసలాడు అనందము పట్టలేకపోతున్నాడు తన కొడుకు పెద్దింటి అల్లుడౌతున్నాడని.

నా కొడుకు ఆ పిల్ల అమ్మా నాన్నలను తీసుకొచ్చినరోజు చూసాను నేను ఆ పిల్లని, కుందనపు బొమ్మలా ఉంది. రాగానే నన్నూ మా ముసలాయనను, అత్తమ్మ, మావయ్య అని నోరార పిలిచింది. నా కూతురిని అల్లుడిని గౌరవంగా పలకరించారు. ఆ పిల్ల అమ్మ, నన్ను వదినా అని నోరార పిలవబట్టింది.

వదినా, పిల్లలు ఇష్టపడ్డారని మేము కాదనలేక పోయాము. మా అల్లుడి మర్యాదలకు లోటు రానివ్వము, పెండ్లి ఖర్చు అంతా మాదే, అంటూ అప్పటికప్పుడే పంతులతో మాట్లాడి పెండ్లి ముహూర్థం కూడా నిర్ణయించారు. చెల్లెమ్మా అంటూ మా వియ్యంకుడు, పెండ్లిపత్రికలు మీ పేరున మేమే వేయించి ఇస్తాము. మాకున్నది ఒక్కగానొక్క కూతురు. దాని బాగోగులు చూడవలసింది ఇక మీరే నంటూ మా తరువాత మా ఆస్తిపాస్తులన్నీ దానికేనంటూ మా ముసలాడిని సంబరపడేటట్లు చేసారు.

పెళ్ళి ఎంతో ఘనంగా చేసారు. అబ్బో మా బందువులు ఆ పెండ్లి మండపాన్ని, ఆ వడ్డనను చూసి బలే సంబరపడ్డారు. మీరు పెట్టి పుట్టారమ్మ అంటూ నన్ను తెగపొగిడారు. మా బందువులందరికి సాంగ్యాలు పెట్టారు. ఇక నా కూతురు, అల్లుడికయితే కొత్త బట్టలు పెట్టడమేకాక ఒక లక్ష చేతికిచ్చారు వద్దు వద్దంటే కూడా.

పెళ్ళి అయిన వెంటనే, మా ఇంటి గడప తొక్కించాలని మా వియ్యపురాలు కొత్త పెళ్ళికొడుకుని, పెళ్ళికూతురుని తీసుకొని బండెడు సాంగ్యముతో బయలుదేరారు. ఆ హంగూ ఆర్బాటము చూసి, నాకయితే నోటమాట రాలేదు. మా ఇంటికొచ్చాక మా వియ్యపురాలు దగ్గరుండి నా కోడలిచేత ఇంటిలో దీపము పెట్టించింది. చుట్టుపక్కల అందరికి నా చేత సాంగ్యాలు పంచిపెట్టింది.

వదినా మూడు రాత్రులపండగ మా ఇంటిలో చేద్దాము, ఇక్కడ పిల్లలకు ఇరకాటంగా ఉంటుంది అని నన్నూ, మా ముసలాడిని కూడా వాళ్ళతో బయలుదేరదీసింది.

పిల్లలిద్దరూ ఎంతో చూడముచ్చటగా ఉన్నారు, చూసినోళ్ళు కళ్ళల్లో నిప్పులు వేసుకుంటారు అంటూ ఇంటికి వెళ్ళగానే గుమ్మడికాయ దిష్టి తీయించింది. మూడురాత్రుల పండగైనాది, వారం గూడా గడచిపొయినాది. నాకయితే పనేలేక కాళ్ళు కట్టేసినట్టున్నాయి ఆ ఇంటిలో.

పిల్లలు చూస్తే ఎంతకి బయలుదేరడంలే...........నాకెందుకో పక్కింటి మీదకు ఎకబాకిన మా మునగచెట్టే గుర్తుకువస్తాఉంది.

మేము వారం తరువాత మా ఇంటికి పోతామని బయలుదేరాము. మా వియ్యపురాలు నాకు మా ముసలాడికి పట్టుబట్టలు పెట్టి మరీ సాగనంపింది.

ఇంటికొచ్చాక ఇక్కడ చూస్తే మా మునగచెట్టు కాయలతో విరగబడి ఉంది. పక్కింటినుండి మునగచారు వాసన గుబాలిస్తోంది ! నాకు అక్కరకు రాని పచ్చగా ఎదిగిన కొమ్మలను నరకలేను, ఆసరా ఇవ్వని కొడుకును దూరం చేసుకోలేను.

నా కష్టం తీరలేదనుకొని మళ్ళీ పనికి బయలుదేరాను!!!!
-hemabobbu

Submitted on: Sun Sep 01 2013 22:29:26 GMT-0700 (PDT)
Category: Original
Language: Telugu
Copyright: A Billion Stories (http://www.abillionstories.com)
Submit your own work at http://www.abillionstories.com
Read submissions at http://abilionstories.wordpress.com
Submit a poem, quote, proverb, story, mantra, folklore in your own language at http://www.abillionstories.com/submit
Comments