posted Jan 12, 2014, 6:31 AM by A Billion Stories
మనసున మల్లెల మాలలూగెనే అంటూ మధుర రాత్రులకు కొత్త అర్థాలు చెప్పినా...ఏడ తానున్నాడో బావ అంటూ విరహ వేదనలోని వివిధ కోణాలు మనకు రుచి చూపించినా...కుశలమా నీకూ కుశలమేనా అంటూ ఆలూ మగల మధ్యన ఉండాల్సిన అనురాగం గురించి కాబోయే దంపతులకు ప్రేమతో చెప్పినా...తొందరపడి ఒక కోయిల చేత కాస్తంత ముందే కూయించినా...
సడి సేయకో గాలి సడి సేయ బోకే బడలి వొడిలో రాజు పవళిoచేనే అంటూ ప్రకృతి కాంతకు ప్రణమిల్లినా.. పగలయితే దొరవేరా...రాతిరి నా రాజువిరా అంటూ రసరమ్యమైన పదాలతో రంజింప చేసినా...పాలిచ్చే గోవులకూ పసుపూ కుంకం,పనిచేసే బసవడికీ పత్రీ పుష్పం సమర్పించి తెలుగు వారి లోగిళ్ళలో అక్షరాలతో అందాల సంక్రాంతి ముగ్గులు దిద్దించినా..
మందారంలా పూస్తే మంచిమొగుదొస్తాడని...గన్నేరంలా పూస్తే కలవాదొస్తాదని...సింధూరంలా పూస్తే చిట్టీ చేయంతా...అందాల చందమామ అతడే దిగి వొస్తాడంటూ పెళ్ళికాని తెలుగమ్మాయిల కలలకు గోరింటాకు సొగసులద్దినా...గోరింకా పెళ్లై పోతే ఏ వంకో వెళ్ళీపోతే గూడంతా గుబులై పోదా గుండెల్లో దిగులై పోదా అంటూ భగ్న ప్రేమికుల గుండెల్లో గుబులును నింపి వారి మనసుల్ని దిగులులో ముంచెత్తినా...
అసలు ఏం చేసినా ఏం రాసినా అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది...ఇంకా చెప్పాలంటే అసలు తెలుగు భాషని గానీ తెలుగు వారిని కాని ఏమన్నా చేసుకునే హక్కు ఆయనకా పరమేశ్వరుదే ఇచ్చాదేమో. .
"జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్య ధాత్రి" అంటూ తన అపారమైన దేశభక్తితో ఏకంగా భరత మాతనే పరవశింప చేసిన ఈ ధన్యజీవి తదనంతరం మన తెలుగు వారందరి కేర్ అఫ్ అడ్రెస్స్ గా మారారు...
మరి అంతటి కృష్ణ శాస్త్రి గారు తెలీని తెలుగు వారు ఎవరన్నా వున్నారంటే అది శాస్త్రి గారికి కాదు వారి సాటి తెలుగు వార మైన మనకే ఎంతో అవమానం...ఎన్నిసార్లు విన్నాఎన్ని తరాల తర్వాత విన్నాఇప్పటికీ ఎంతో కొత్తగా అనిపించే ఎన్నోఆణిముత్యాలను మన తెలుగు వారికందించిన ధన్య చరితులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు..
అటువంటి పరమ పుణ్యాత్ములైన శాస్త్రిగారు అదేమీ శాపమో గానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎనలేని విషాదాన్ని చవి చూసారు..
"నావలోతానుండి మము నట్టేట నడిపే రామచరణం...త్రోవలో కారడవిలో తోత్తోడ నడిపే రామచరణం... నావ అయితే రామచరణం...త్రోవ అయితే రామచరణం...మాకు చాలును వికుంట మందిర తోరణం శ్రీరామ చరణం.."
అంటూ మనకు తత్వ బోధన చేసిన కృష్ణ శాస్త్రి గారు కాన్సర్ తో తన మాట్లాడే శక్తిని పూర్తిగా కోల్పోయినా పెద్దగా బాధ పడలేదు గానీ తన కంటి వెలుగైన తన ముద్దుల గారాల పట్టి సీత అకాల మరణాన్నిమాత్రం జీర్ణించుకోలేక పొయారు...
కూతురిని కోల్పోయిన బాధ శాస్త్రి గారిని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా చాలా కుంగ తీసిందనే చెప్పాలి...అదే సమయంలో ఆర్థిక సమస్యలు కూడా వారిని చుట్టు ముట్టి ఉక్కిరి బిక్కిరి చేసాయి...
"..ఈ గంగాకెంత గుబులు...ఈ గాలికెంత దిగులు.. " అంటూ ప్రకృతిలోని ఎన్నిటి గురించో దిగులు పడ్డ శాస్త్రి గారు తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చెప్పు కోలేని బాధలనుభవించారు...
సరిగ్గా ఆ సమయంలోనే మరపురాని ఓ చిన్న సంఘటన ఆ రోజుల్లో జరిగింది..
పశుపతినాథ్ దేవాలయంలో ఇద్దరు బౌద్ధ భిక్షువులు
చిన్నదే అయినా ఆ తరవాతి కాలంలో ఈ మహత్తర సంఘటన వలన కొన్ని మధురమైన పాటల్ని మనం వినగాలిగాం...తెలుగు చిత్ర పరిశ్రమలో బహుశా కొద్ది మందికి మాత్రమె తెలిసిన ఈ సంఘటన 1974-75 ప్రాంతంలో మదరాసు మహాపట్టణం లోని ప్రముఖ సంభాషణల రచయిత గొల్లపూడి మారుతీ రావు గారింట్లో జరిగింది..
మద్రాసు కేంద్రంగా తెలుగు చిత్ర పరిశ్రమ మూడు పువ్వులూ ఆరు కాయలుగా కళ కళ లాడుతుందే రొజులవి...చిత్ర పరిస్రమకు సంబందించిన చిన్నాపెద్దా అందరూ అప్పట్లో మద్రాసులోనే వుండేవారు..
గొల్లపూడి మారుతీ రావు గారు కూడా మద్రాసులోనే వుండేవారు..
ఈ మహత్తరమైన సంఘటన జరిగిన రోజున పొద్దున్న పూట ఎప్పట్లాగే తన పనులు ముగించుకొని ఉదయం 8.30 గంటల సమయంలోమారుతీరావు గారు బయటి కెళ్ళటానికి సిద్దమవుతుండగా ఒక ఫియట్ కారొచ్చి ఆయన ఇంటి ముందాగింది ..
".. పొద్దున్నేఎవరో మహానుభావులు.." అనుకుంటూ మారుతి రావు గారు కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి పోయారు..
ఆయన్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ కారు లోంచి మహా కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కిందకి దిగారు..అంతటి మహనీయులు తన ఇంటికొచ్చారనే ఆనందంతో కాసేపు ఉబ్బితబ్బిబ్బయినా వెంటనే తేరుకొని మారుతీ రావు గారు శాస్త్రి గారికి ఎదురెళ్లి సాదరంగా వారిని ఇంట్లోకి ఆహ్వానించారు..
కాఫీ ఫలహారాలు అవీ పూర్తయిం తరువాత శాస్త్రిగారు తన కేదో విషయం చెప్పాలనుకొని కూడా చెప్పటానికి సంశయిస్తున్నారని అర్థం అయ్యింది మారుతీ రావు గారికి..
మెల్లిగా తను కూర్చున్న కుర్చీ లోంచి లేచి.. శాస్త్రి గారికి దగ్గరగా వచ్చి.. ముందు కొంగి..ఆయన మోకాళ్ళ మీద చేతులేసి.. ఆయన మొహంలోకి చూస్తూ...లోగొంతుకలో ఎంతో ఆప్యాయంగా అడిగారు మారుతీ రావు గారు..
"మాస్టారూ మీరు నాతో ఏదో చెప్పాలనుకొని కూడా చెప్పలేక పోతున్నారు..నా దగ్గర కూడా సంశయిస్తె ఎట్లా చెప్పండి.. అంత మరీ పరాయి వాడినయి పోయానంటారా ..."
తానెంతో ఆరాధించే తన గురువు గారు తన ముందు గూడా మొహమాట పడుతున్నారన్నఅక్కసుతో కావాలనే కాస్త నిష్టూరాలాడుతూ మాట్లాడారు మారుతీరావు గారు..
అప్పుడు జరిగిందండీ ఆ సంఘటన..
ఎంతటి వాడి చేత నైనా కంట తడి పెట్టించే ఒక విషాదకరమైన ఘటన...
మీరే చదవండి .తెలుస్తుంది .
శాస్త్రిగారికి ఆ రోజుల్లో స్వర పేటికకి కాన్సర్ సోకటం వలన గొంతు పూర్తిగా మూగ బోయింది...అందుకని ఆయన ఎక్కడికెళ్ళినా ఒక పలకా బలపం చేతిలో పట్టుకొని వెళ్ళేవారుట...ఎవరికేం చెప్పదలుచుకున్నా ఆ పలక మీదనే రాసి చూపించేవారుట...
మారుతీ రావు గారు తన దగ్గరికొచ్చిఅలా అడగంగానే శాస్త్రి గారు ముందుగా ఒక పేలవ మయిన జీవం లేని నవ్వు నవ్వారు...
Tree
ఆ తరువాత తల వొంచుకొని పలక మీద చిన్నచిన్న అక్షరాలతో దాదాపు ఓ రెండు నిమిషాలపాటు చాలా పొందికగా ఏదో రాస్తూ ఉండిపోయారు...ఆ తరువాత అదేంటో చదవమని పలక మారుతీ రావు గారి చేతి కిచ్చారు...
అందులో ఏముందో చదవటానికి మారుతీ రావు గారికి ముందొక పావు నిమిషం పట్టింది...ఆ తరువాత అందులోని విషయాన్నిసంగ్రహించి జీర్ణించు కోవటానికింకో అర నిమిషం పట్టింది...ఆ పైన లోపలి నుండి తన్నుకుంటూ వొస్తున్న దుంఖాన్ని ఆపుకోవటానికి మరో నిమిషం పట్టింది...
".. నాకుషస్సులు లేవు..ఉగాదులు లేవు.. " అంటూ తెలుగు సాహితీ లోకాన్నిఉర్రూతలూగించిన ఈ మహా మనీషి జీవితంలోంచి నిజంగానే ఉషస్సులూ ఉగాదులూ వెళ్లిపోయాయా అనుకుంటూ కాసేపలా మౌనంగా ఉండిపోయారు మారుతీ రావు గారు...
ఏం సమాధానం చెప్పాలో వెంటనే అర్థం కాలేదు...అసలు అట్లాంటి ఒక విపత్కర పరిస్థితి తన జీవితంలో వొస్తుందని కూడా ఆయన ఏనాడు ఊహించలేదు...అయినా వెంటనే తనను తాను తమాయించుకొని తల లేపి శాస్త్రిగారే వేపు చూసారు..
"..పెరిగి విరిగితి విరిగి పెరిగితి...కష్ట సుఖముల సార మెరిగితి...పండుచున్నవి ఆశ లెన్నొ...ఎండి రాలగ పోగిలితిన్..." అన్నంత దీనంగా వుంది అప్పటి కృష్ణ శాస్త్రి గారి ముఖస్థితి..
ఎప్పుడూ తళతళ లాడే జరీ అంచు వున్నపట్టు పంచెలొ కనపడే శాస్త్రి గారు ఆ సమయంలో కేవలం ఒక మామూలు ముతక పంచెలో కనపడ్డారు...చాలా బేలగా మారుతీరావు గారి వేపు చూస్తున్నారు...
దుంఖాన్ని దిగమింగుకొని మారుతీరావు గారు మళ్ళీ పలక వేపు చూసారు...
"మారుతీ రావూ...నా పరిస్థితులేమి బాగా లేవయ్యా...చాలా ఇబ్బందుల్లో వున్నాను...ఓ ఇరవై వేలు అర్జెంటుగా కావాలి...అందుకని నా కారు అమ్మేద్దామనుకుంటున్నాను...నీ ఎరకలో ఎవరన్నా స్తితిమంతులుంటే చెప్పు...అమ్మేద్దాం...నాకు తెలుసు నువ్వు చాలా బిజీగా ఉంటావని...కానీ తప్పలేదు.. అందుకే పొద్దున్నే వచ్చినిన్ను ఇబ్బంది పెట్టాల్సోచ్చింది...నా కోసం ఈ పని చేసి పెట్టవయ్యా మారుతీ రావు...గొప్పసాయం చేసిన వాదివవుతావ్..."
తన కనురెప్పలు వాలిస్తే ఎక్కడ తన కంట్లో నీళ్ళు జారి పది మాస్టారిని మరింత బాధ పెడతాయో అని తనను తాను సంభాళించుకుంటూ మారుతీ రావు గారు శాస్త్రి గారి మొహంలోకి కాసేపలా తదేకంగా చూస్తూ ఉండిపోయారు..
ఆ తరువాత మెల్లిగా లేచి వెళ్ళి శాస్త్రిగారి కాళ్ళ దగ్గర కూర్చొని
"..మాస్టారు...మీ పరిస్థితి నాకర్ధమయ్యింది...కాని కారు గూడా లేకుండా ఈ మహ పట్టణం లో ఏమవస్థలు పడతారు చెప్పండి...మీరు అన్యధా భావించనంటే ఒక్క మాట...చెప్పమంటారా.." అంటూ ఆయన మొహంలోకి చూస్తూ ఆయన అనుమతి కోసమన్నట్టుగా ఆగారు మారుతీరావు గారు...
అదే పేలవమయిన నవ్వుతో చెప్పూ అన్నట్టుగా తలాదించారు శాస్త్రిగారు...
"..ఆ ఇరవై వేలు నేను సర్దుబాటు చేస్తాను...ఆహా...అప్పుగానే లెండి...మీకు వీలు చిక్కినపుడు ఇద్దురు గాని...నాకేమంత తొందరా లేదు అవసరమూ లేదు...దయచేసి నా మాట కాదనకండి ..."
వెంటనే తల వొంచుకొని శాస్త్రిగారు మళ్ళీ పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు...
"..నా వల్ల నువ్వు ఇబ్బంది పడటం నాకిష్టం లేదయ్యా..".. ఇదీ శాస్త్రిగారు రాసింది..
"....అయ్యా నాకేమి ఇబ్బంది లేదండి...తండ్రి లాంటి వారు మీరు ఇబ్బందుల్లో వుంటే చూస్తూ వూరుకోమంటారా చెప్పండి...అయినా దేవుడి దయ వలన నా పరిస్థితి బానే వుంది లెండి...ఇంక మీరు దయ చేసి నా మాట కాదనకండి..."
దానికి శాస్త్రిగారు ముందు కాస్త పేలవంగా నవ్వినా ఆ తరువాత కష్టాల నెన్నిటినో కడుపులో దాచుకొని తన పిల్లల కోసం ఒక నాన్న నవ్వే ప్రేమ పూరితమైన చిరు నవ్వు నవ్వారు.. దాన్నే అంగీకార సూచకంగా భావించి మారుతీరావు గారన్నారు..
Beauty Of Nature
"..మాస్టారూ..ప్రస్తుతానికి అంత డబ్బు ఇంట్లో లేదు...బ్యాంకు నుండి తీసుకురావాలి..సాయంత్రం కల్లా తెప్పించి పెడతాను...పర్వాలేదు కదా..."
".. ఏమీ పర్వాలేదు " అన్నట్టుగా తలూపారు శాస్త్రిగారు...
ఆ తర్వాత ఇంక బయలుదేరుతాను అన్నట్టుగా లేచి నిలబడ్డారు..
వారిని సాగనంపటం కోసం గేటు దాకా వచ్చి కార్ డోర్ తీసి నిలబడ్డారు మారుతీరావు గారు...
కారెక్కుతుండగా ఆగి మళ్ళీ తన చేతిలో పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు శాస్త్రిగారు...
"..డబ్బులు తీసుకోవటానికి సాయంత్రం నన్ను ఎన్నింటికి రమ్మంటావ్.."..ఇదీ దాని సారాంశం...
గుండె పగిలినట్టుగా అనిపించింది మారుతీ రావు గారికి....కొద్దిగా నొచ్చుకున్నట్టుగా అన్నారు..
"..అయ్యా డబ్బులు తీసుకోవటం కోసం మిమ్మల్నిమళ్ళీ మా ఇంటికి రప్పించి పాపం మూట గట్టు కోమంటారా...మీకా శ్రమ అక్కర్లేదు లెండి.... సాయంత్రం నేనే డబ్బు తీసుకొని మీ ఇంటికి వస్తాను... సరేనా "
"..సరే...అట్లాగే రావయ్యా ...వచ్చి భోంచేసి వెళ్ళదు గాని...'" అని మళ్ళీ పలక మీద రాసి మారుతీరావు గారికి చూపించి కారేక్కారు శాస్త్రిగారు..
వారి సంస్కారానికి ఓ నమస్కారం చేసి వారిని సాగ నంపారు మారుతీ రావు గారు...
అన్నట్టుగానే ఆ సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో డబ్బు తీసుకుని శాస్త్రి గారింటికి వెళ్ళారు మారుతీ రావు గారు...
వారికి డబ్బులందించి భోజనాలు చేసి బయలు దేరే ముందు శాస్త్రి గారితో అన్నారు మారుతీ రావు గారు...
"..మాస్టారు...అతి చనువు తీసుకుంటున్నానని మీరనునుకోకపోతే ఓ మాట అడగచ్చంటారా.."
అడుగు అన్నట్టుగా తలూపారు శాస్త్రిగారు..
"..వీలయితే మళ్ళీ పాటలు రాస్తారా....నవతా వాళ్ళేదో కొత్త సినిమా తీస్తున్నారుట...దాంట్లో ఏదో తెలుగు భాషకు సంబంధించి ఒక పాట పెడదా మనుకుంటున్నారట..మిమ్మల్ని అడిగే ధైర్యం లేక నన్నడిగారు.. కనుక్కొని చెబుతానన్నాను...మళ్ళీ పాటలు రాయకూడదూ..మీకూ కాస్త వ్యాపకంగా వుంటుందీ..ఏదో వేన్నీళ్ళకు చన్నీళ్ళ మాదిరి నాలుగు రాళ్ళూ వస్తాయి...ఏం చెప్పమంటారు..."
"..సరే కానీవయ్యా.. నీ మాటెందుకు కాదనాలి.."..పలక మీద రాసి చూపించారు శాస్త్రిగారు...
ఆ తర్వాత కొన్నాళ్ళకు నవతా వారి సినిమా సాంగ్ రికార్డింగ్ A V M స్టూడియో లో ప్రారంభ మయ్యింది....
ఆ రోజక్కడ రికార్డింగ్ లో సంగీత దర్శకులు జి కే వెంకటేష్ గారు,కృష్ణశాస్త్రి గారూ,ప్రముఖ గాయని సుశీల వంటి మరి కొంతమంది ప్రముఖులు కూడా వున్నారు...అందరూ కూడా శాస్త్రిగారు రావటంతో చాల సంతోషంగా వున్నారు..
ముందుగా శాస్త్రిగారి పాటతో రికార్డింగ్ మొదలయ్యింది..
మధ్యలో శాస్త్రి గారు రాసిన చరణంలో ఎక్కడో ఒక చిన్న డౌట్ వచ్చి జి కే వెంకటేష్ గారు శాస్త్రి గారి దగ్గర కొచ్చి ఏదో చెవిటి వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా చాలా పెద్ద గొంతుతో అడిగారు
"...అయ్యా మీరిక్కదేదో రాసారు గాని మీటర్ ప్రాబ్లం వచ్చేలా ఉంది...ఈ పద మేమన్నా కొంచెం మార్చ గల రేమో చూస్తారా " అని...
దానికి సమాధానంగా శాస్త్రిగారు తన పలక మీద ఇలా రాసారు..
".. దానికేం భాగ్యం..తప్పకుండా మారుస్తాను..కానీ ఒక చిన్న విషయం...నేను మాట్లాడలేను గాని నా చెవులు బాగానే పని చేస్తున్నాయి...గమనించ గలరని మనవి "..
అది చదివి జి కే వెంకటేష్ గారితో సహా అక్కడున్న పెద్దలందరూ శాస్త్రి గారి సెన్స్ అఫ్ హ్యుమర్ కి హాయిగా నవ్వేశారు...
ఆ తర్వాత శాస్త్రిగారి పాటతో సహా ఆ సినిమాలోని అన్ని పాటల రికార్డింగ్ పూర్తయిపోయాయి..సినిమా కూడా షూటింగ్ ముగించుకొని విడుదలై పెద్ద హిట్ అయ్యింది..
ఆ సినిమా కోసం శాస్త్రిగారు రాసిన పాట ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రంలో ఏదో మూల వినపడుతూనే ఉంది ..
ఆ పాటే...
అమెరికా అమ్మాయి లోని "...పాడనా తెలుగు పాట...పరవశమై మీ ఎదుట మీ పాట.."
ఆంధ్రా లో ప్రక్రుతి అందాలు
ఉపసంహారం
ఆ తర్వాత కృష్ణశాస్త్రి గారు మరికొన్ని మంచి పాటలు మనకందించారు...వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి...
"..ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం..",(కార్తీక దీపం) ".. గొరింటా పూసింది కొమ్మా లేకుండా...",(గోరింటాకు) "..ఈ గంగకెంత దిగులు...ఈ గాలి కెంత గుబులు..",(శ్రీరామ పట్టాభిషేకం) "..ఆకులో ఆకునై పూవు లో పూవునై.." (మేఘసందేశం) మొదలైనవి...వయోభారం వలన ఆ తరువాత పాటలు రాయటం పూర్తిగా తగ్గించేసారు శాస్త్రిగారు...
"..నారాయణ నారాయణ అల్లా అల్లా...నారాయణ మూర్తి నీ పిల్లల మేమెల్లా.." అంటూ పరబ్రహ్మ ఒక్కడే అని ఎంతో సున్నితంగా లోకానికి చాటి చెప్పిన విశ్వకవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తన కవితామృతం తో తెలుగు శ్రోతల్నిఅమరుల్నిచేసినా తాను మాత్రం నింపాదిగా మనదరినీ వదిలేసి "..నీ పదములే చాలూ... రామా...నీ పద ధూళియే పదివేలూ .." అంటూ ఫిబ్రవరి 24,1980 నాడు తన శ్రీరాముడి పాద ధూళిని వెతుక్కుంటూ వేరే లోకాల వేపు సాగిపోయారు..
ముక్తాయింపు
"...అంత లజ్జా విషాద దురంత భార...సహనమున కోర్వలేని ఈ పాడు బ్రతుకు...మూగవోయిన నా గళమ్మునను గూడ...నిదుర వోయిన సెలయేటి రొదలు గలవు...ఇక నేమాయె..." --కృష్ణపక్షం
- -narrenaditya
Submitted by: narrenaditya Submitted on: Thu Jan 02 2014 14:19:35 GMT+0530 (IST) Category: Original Language: తెలుగు/Telugu
- Read submissions at http://abillionstories.wordpress.com - Submit a poem, quote, proverb, story, mantra, folklore, article, painting, cartoon, drawing, article in your own language at http://www.abillionstories.com/submit
|
posted Sep 6, 2013, 6:26 PM by A Billion Stories
మా పుట్టింట్లో పెద్ద మునగచెట్టు ఉండేది. చెట్టు నిండుగా చివుర్లు, పూతలతో కళకళలాడుతుండేది. ఇంట్లో అంత ఎసరు పెట్టుకుంటే చాలు, కూరకు కమ్మని మునగ పప్పు, మునగ చారు తయారుగా ఉండేవి. మేమందరము పనికి పోయి కష్టపడి ఇంటికి రాగానే మా అమ్మ పెట్టిన వేడివేడి రాగిసంగటి, ఎండుచేపలు వేసిన మునక్కాయ పులుసును లొట్టలు వేసుకొంటూ తినేవాళ్ళం.
నాకు పెండ్లయినాక ఎప్పుడైనా పుట్టింటికి పోయినప్పుడు తప్పనిసరిగా ఆ లేత చిగురులను తాలింపు పెట్టించేదాన్ని. కమ్మని ఆ రుచి నాకు ఇంకెక్కడా తగలలేదు.
మేము టౌన్లొ చిన్న ఇల్లు కట్టగానే నేను ఆ మునగ కొమ్మను తెచ్చి మా పెరట్లొ పాతాను. అప్పటికి నాకొడుకు ఇంకా చేతికి అందిరాలేదు. టౌన్లొ ఏది కొనాలన్నా కష్టమే. నాలుగు కడుపులు నింపడానికి నేను, నా మొగుడు చానా అవస్థలు పడ్డాము.
మా ముసలాడు చూస్తే నాలుగు పదులు రాకనే అదేదో మాయజారి జబ్బుతో శక్తిలేనివాడై పనికిపోక ఇంట్లో కూర్చోని తినబెట్టినాడు. నాలుగు చేతులు ఆడుతుంటేనే కష్టమైన రోజుల్లొ, నేనొక్కటే పనికి పోబెట్టినాను. కొడుకు చేతికి ఎప్పుడు అందివస్తాడా అని చూస్తున్నా.
నేను మా పెరట్లో నాటిన మునగకొమ్మ కళకళలాడుతూ పెరగడం మొదలు పెట్టింది. ఎప్పుడెప్పుడు అది ఇగుర్లు యేస్తుందా, పూత పూస్తుందా అని దానికి చికెన్ కడిగిన నీళ్ళు పోస్తూ, రోజు టీ కాచాక మిగిలిన రొట్ట వేస్తూ అనుకునేదాన్ని. అది ఏపుగా పెరగడం మొదలు పెట్టింది.నా కష్టం చూసి పైవాడు ఓర్వలేక కాబోలు నా కొడుక్కి చదువు బాగ వంటబట్టింది. వాడు నా కష్టంతో, వాడి స్కాలర్షిప్పులతో చదువుకోబెట్టినాడు.
నా కొడుకు చదువులొ చురుగ్గా ఉండి ఇంజనీరింగ్లో సీటు తెచ్చుకున్నాడు. నేను ఆ పని ఈ పని అని చూడక అన్ని పనులకూ వెళ్ళి ఇల్లు గడిపేదాన్ని, అందులోనే నాలుగు డబ్బులు నా కొడుకు పుస్తకాలకోసం, పెన్నులకోసం దాచేదాన్ని. మా మునగచెట్టు మా పుట్టింట్లోకంటే చురుగ్గా మా పెరట్లో పెరగబెట్టింది. దాని కొమ్మలు నాలుగేండ్లు తిరక్కుండానే అల్లుకుపోయాయి. కాని కొమ్మలు మా పెరటిని దాటి పక్కింటి ఇంటిపైకి పెరగబెట్టాయి. వాళ్ళు మా మునగ రుచి మరిగి పూతను కూడా దుయ్యబెట్టినారు.
నా కొడుకు కాలేజి చదువు పూర్తికాకముందే, వానికి అదేదో విప్రో అనే పెద్ద కంపనీలో ఉద్యోగం వేసారు. వానికి నలబైవేల జీతమని చెప్పినాడు. మా బందువులందరూ నీకేమమ్మ కొడుకు ఎదిగి వచ్చాడు, ఇక నీ కట్టం తీరిపోతాదిలే అనబెట్టినారు.
ఆడ చూస్తే మా మునగచెట్టు పిందె బట్టినాది. ఎప్పుడెప్పుడు పిందె కాయావుతుందా అని చూస్తాన్నా. మా పెరటి మునక్కాయ పులుసు లో చేపలు కూరి జొన్న రొట్టెలతో తిన్నామంటే ఆ రుచి అదేదో ఐదు స్టార్ల హోటల్ లో కూడా ఉండదు.
నా కొడుకు ఒకరోజు నాతో మాట్లాడుతూ తానొక అమ్మాయిని ప్రేమించానని, వాళ్ళు మనకంటే పెద్ద కులపోళ్ళు అయినా తమ పెళ్ళికి ఆ అమ్మాయి తల్లితండ్రులు అంగీకరించారని చెప్పాడు. తాను ఆ అమ్మాయినే పెళ్ళాడతానని చెప్పాడు. వాళ్ళ పెద్దోళ్ళు మంచి రోజు చూసుకొని మన ఇంటికి వస్తామన్నారని చెప్పాడు.
ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, వాడి మనస్సుకు నచ్చిన మనువాడతానని అంటే ఎందుకు కాదనాలని అనుకొన్నాము. వాడి అక్క పెండ్లి కూడా చేసేసాము కదా, ఇక వాడి పెండ్లె కదా చేయాల్సిందని, వాడి మనస్సుని ఎందుకు కష్టపెట్టడమని ఒప్పుకొన్నాము. మా ముసలాడు అనందము పట్టలేకపోతున్నాడు తన కొడుకు పెద్దింటి అల్లుడౌతున్నాడని.
నా కొడుకు ఆ పిల్ల అమ్మా నాన్నలను తీసుకొచ్చినరోజు చూసాను నేను ఆ పిల్లని, కుందనపు బొమ్మలా ఉంది. రాగానే నన్నూ మా ముసలాయనను, అత్తమ్మ, మావయ్య అని నోరార పిలిచింది. నా కూతురిని అల్లుడిని గౌరవంగా పలకరించారు. ఆ పిల్ల అమ్మ, నన్ను వదినా అని నోరార పిలవబట్టింది.
వదినా, పిల్లలు ఇష్టపడ్డారని మేము కాదనలేక పోయాము. మా అల్లుడి మర్యాదలకు లోటు రానివ్వము, పెండ్లి ఖర్చు అంతా మాదే, అంటూ అప్పటికప్పుడే పంతులతో మాట్లాడి పెండ్లి ముహూర్థం కూడా నిర్ణయించారు. చెల్లెమ్మా అంటూ మా వియ్యంకుడు, పెండ్లిపత్రికలు మీ పేరున మేమే వేయించి ఇస్తాము. మాకున్నది ఒక్కగానొక్క కూతురు. దాని బాగోగులు చూడవలసింది ఇక మీరే నంటూ మా తరువాత మా ఆస్తిపాస్తులన్నీ దానికేనంటూ మా ముసలాడిని సంబరపడేటట్లు చేసారు.
పెళ్ళి ఎంతో ఘనంగా చేసారు. అబ్బో మా బందువులు ఆ పెండ్లి మండపాన్ని, ఆ వడ్డనను చూసి బలే సంబరపడ్డారు. మీరు పెట్టి పుట్టారమ్మ అంటూ నన్ను తెగపొగిడారు. మా బందువులందరికి సాంగ్యాలు పెట్టారు. ఇక నా కూతురు, అల్లుడికయితే కొత్త బట్టలు పెట్టడమేకాక ఒక లక్ష చేతికిచ్చారు వద్దు వద్దంటే కూడా.
పెళ్ళి అయిన వెంటనే, మా ఇంటి గడప తొక్కించాలని మా వియ్యపురాలు కొత్త పెళ్ళికొడుకుని, పెళ్ళికూతురుని తీసుకొని బండెడు సాంగ్యముతో బయలుదేరారు. ఆ హంగూ ఆర్బాటము చూసి, నాకయితే నోటమాట రాలేదు. మా ఇంటికొచ్చాక మా వియ్యపురాలు దగ్గరుండి నా కోడలిచేత ఇంటిలో దీపము పెట్టించింది. చుట్టుపక్కల అందరికి నా చేత సాంగ్యాలు పంచిపెట్టింది.
వదినా మూడు రాత్రులపండగ మా ఇంటిలో చేద్దాము, ఇక్కడ పిల్లలకు ఇరకాటంగా ఉంటుంది అని నన్నూ, మా ముసలాడిని కూడా వాళ్ళతో బయలుదేరదీసింది.
పిల్లలిద్దరూ ఎంతో చూడముచ్చటగా ఉన్నారు, చూసినోళ్ళు కళ్ళల్లో నిప్పులు వేసుకుంటారు అంటూ ఇంటికి వెళ్ళగానే గుమ్మడికాయ దిష్టి తీయించింది. మూడురాత్రుల పండగైనాది, వారం గూడా గడచిపొయినాది. నాకయితే పనేలేక కాళ్ళు కట్టేసినట్టున్నాయి ఆ ఇంటిలో.
పిల్లలు చూస్తే ఎంతకి బయలుదేరడంలే...........నాకెందుకో పక్కింటి మీదకు ఎకబాకిన మా మునగచెట్టే గుర్తుకువస్తాఉంది.
మేము వారం తరువాత మా ఇంటికి పోతామని బయలుదేరాము. మా వియ్యపురాలు నాకు మా ముసలాడికి పట్టుబట్టలు పెట్టి మరీ సాగనంపింది.
ఇంటికొచ్చాక ఇక్కడ చూస్తే మా మునగచెట్టు కాయలతో విరగబడి ఉంది. పక్కింటినుండి మునగచారు వాసన గుబాలిస్తోంది ! నాకు అక్కరకు రాని పచ్చగా ఎదిగిన కొమ్మలను నరకలేను, ఆసరా ఇవ్వని కొడుకును దూరం చేసుకోలేను.
నా కష్టం తీరలేదనుకొని మళ్ళీ పనికి బయలుదేరాను!!!! -hemabobbu
Submitted on: Sun Sep 01 2013 22:29:26 GMT-0700 (PDT) Category: Original Language: Telugu Copyright: A Billion Stories (http://www.abillionstories.com) Submit your own work at http://www.abillionstories.com Read submissions at http://abilionstories.wordpress.com Submit a poem, quote, proverb, story, mantra, folklore in your own language at http://www.abillionstories.com/submit
|
posted Jul 31, 2013, 8:52 AM by A Billion Stories
అమ్మాయే కావాలి
ఆడపిల్ల పుట్టింది ఈమాటలు మగతలోవున్న శారద చెవుల్లో పడ్డాయి. ఆతృతగా బిడ్డని చూడాలని కళ్ళుతెరచి "నర్స్ పాప పుట్టిందా"? "అవునమ్మా యిదిగో చూడు పాపని అంటూ ట్రేలో పడుకోపెట్టిన బిడ్డని చూపింది. అమాయకంగా ముద్దుగా వున్న బిడ్డని చూడగానే శారద తను పడ్డ కష్టమంతా మర్చిపోయి ఆప్యాయంగ బిడ్డని తడిమింది,వార్డులో బెడ్డు మీదకి తీసుకురాగానే"ఆనవాయితీ తప్పలేదమ్మా నా లాగే నీకూ ఆడపిల్లే పుట్టింది."అమ్మ మాటలు కఠోరంగా చెవులో పడ్డాయి.ఆస్వరంలొ వున్న తృణీకారం మనసులోముల్లు గుచ్చినట్లయింది. మధ్యతరగతి కుటుంబంలో నాలుగో ఆడపిల్లగ జన్మించిన శారద ఆడపుట్టుకలొ అనుభవించవలసిన చిన్నచూపు తృణీకార భావం అంతా బాల్యం నుంచే చవి చూసింది. పన్నెండేళ్ళ వయసు వచ్చేసరికి ఒక దృఢాభిప్రాయానికి వచ్చింది ఎలాగైనా సరే ఆడపిల్ల యేవిషయంలోను తీసిపోదన్న విషయం నిరూపించాలని, మనసుకి తగిలిన ప్రతి గాయపు చేదుని ఒక్కొక్క సవాల్ గాతీసుకుంది.పొడుపు మాటల్ని పోగు చేసి పట్టుదలగా మలచుకొంది.దాని ఫలస్వరూపమే పదవ తరగతిలో రాష్ట్ర స్థాయిలో ప్రధమస్థానం లభించింది.
ఆరోజున కూడా తల్లి మూతి విరిచింది, మగమహారాజుకి చదువబ్బితే కుటుంబాన్ని పోషిస్తాడు ఆడపిల్ల చదివి యెవర్ని వుధ్దరించాలి? అంటూ దీర్ఘాతీసింది.వెనుకంజ అన్న పదం శారద నిఘంటువు లోంచి తొలగించివేసింది. ఇంటరులో స్కాలర్ షిప్పు దొరికింది, చదువుకోసం ప్రత్యేకించి ఖర్చులేదు చదువు మాన్పించితే పెళ్ళి చెయ్యాలి శారద ముగ్గురి అక్కలలో యిద్దరి పెళ్ళిళ్ళయ్యాయి. మూడో అమ్మాయి పెళ్ళి ప్రయత్నాలుజోరుగా అవుతున్నాయి. ఈ పరిస్థితిలో శారద గురించి పట్టించుకునే వాళ్ళులేరు.ఇంటరు,బి ఎ పూర్తి చేసి బేంకు పరీక్షలు యిచ్చి సెలెక్టు అయింది.ఇంటిలో వాళ్ళు శారద గురించి ఆలోచించే లోపున ఆమె బేంకు వుద్యోగి అయింది. శారద తమ్ముడు మోహన్ తల్లి తండ్రులకు ముద్దు బిడ్డడు. కోరాలేగాని కొండమీది కోతినైనా తెచ్చికొడుకు ముందుంచేవారు, అంతంత మాత్రం చదువు సాగింది. గ్రాడ్యుయేషన్ దాకా వచ్చి బండి ముందుకి సాగదని చదువు మానేసాడు గారాల కుమారుడు. అన్నీ సమయానికి అమర్చుతూంటే అది లేదు యిది లేదు అంటూ తల్లిమీద అక్క మీద కేకలువెయ్యడం తప్ప ప్రత్యేకమైన పనిలేదు.
ఒక రోజు పనిమీద వెళ్తున్నతండ్రి సైకిలు జీపుతో గుద్దుకుని కాలు విరిగి హాస్పిటల్ పాలయ్యాడు.ఆరోజున అన్నింటికీ అండగా నిల్చింది శారద.కాలు నయమై యింటికి వచ్చినా ఆరు నెలలు విశ్రాంతి అవసరం అని డాక్టరు చెప్పడంతో యింట్లోనే కర్ర సహాయంతో తిరుగు తున్న తండ్రికి శారదలొ వొక ప్రత్యేకత కనుపించింది. తల్లి మాత్రం ఆడపిల్లకెందుకు వుద్యోగాలు పెళ్ళి చేసి వొక అయ్య చేతిలో పెట్టడమేగా అంటూ రోజూ దీర్ఘాలు తీసేదిగాని యీమధ్యకాలం అంతా ఆ అడపిల్లే సంసారాన్ని సజావుగా నడిచేటట్ట్లు చేసిందని వొప్పుకుందికి మనసొప్పలేదు. తమ్ముణ్ణి దారిన పెడదామని శత విధాల ప్రయత్నించి విఫలమైంది. ఏదైనా చిన్న వ్యాపారం పెట్టిద్దామనుకుంది చిన్న చిన్న వ్యాపారాలు చెయ్యడానికి మోహన్ యిష్టపడలేదు.చేసేదిలేక తన వుద్యోగం మీద శ్రధ్ద పెట్టి వొకతపస్సులా ఏడు సంత్సరాలు గడిపింది బేంకు పరీక్షలన్నీ పాసై ఆఫీసరుగా ప్రమోషను పొందగలిగింది. ఆరోజున తల్లి తండ్రులు ఆమె వున్నతిని పరిపూర్ణ హృదయంతో ఆమోదించలేక కించపరిచే ధైర్యం లేక నిర్లిప్తత ప్రదర్శించారు. శారద కొత్తగా బాధ పడనూలేదు ప్రోత్సాహం ఆశించనూలెదు.
తన జీవితంలో కూడా వసంతం వస్తుందని వూహించని శారద తన తోటి వుద్యోగి తనను పెండ్లి చేసుకునే వుద్దేశంవ్యక్త పరుస్తే ముందు ఆశ్చర్యపోయింది వచ్చిన అవకాశం జారవిడువడం అవివేకమనుకుంది.తను వున్న పరిస్తితిలో పెండ్లి చేసుకుని వొక్కసారిగా బయట పడితే తల్లి తండ్రులు నిస్సహయులవుతారని తనను కోరుకున్న శేఖరుకి రెండు షరతులు పెట్టింది ఒకటి తన తల్లి తండ్రుల పోషణకు అభ్యంతరం వుండకూడదు. రెండవది తనకి ఆడపిల్ల పుడితే హీనదృష్టితో చూడకూడదు. రెండు షరతులు బేషరతుగా వొప్పుకున్నాడు .తనకి అమ్మాయే కావాలంటూ మనస్ఫూర్తిగా శారద చేయినందుకున్నాడు. అంతా నిర్ణయించుకున్నాక తల్లితండ్రులకు తెలియజెప్పింది. తమకున్న ఒక్క బాధ్యత తీరుతున్నందుకు సంతోషించారు. తరువాత తమగతేమిటని వ్యాకుల పడ్డారు. తన తరఫున యెవరూ లేకపోవటంతో శేఖరు వాళ్లతోనే వుంటూ శారద తల్లితండ్రులను తన వారిగానె భావించి గౌరవించడంతో వారి మనసు తేలిక పడింది. శారదకి పెండ్లి అయినట్లు పరాయి అయినట్లుగాఅనిపించలేదు. అప్పుడప్పుడు తన గురించి యితరులతో మా శారద యిలాగ అలాగ అంటూ చెప్పినప్పుడు రవ్వంతాప్యాయత తల్లి స్వరంలొ విన్నప్పుడు మాత్రం శారద కొద్దిగా చలించేది. పెండ్లయిన యేడాదికి శారద గర్భవతి అయింది. బిడ్డ పుట్టేవరకు కాలం చాలా ఆహ్లాదకరంగానే గడిచింది శారదని కాలు కింద పెట్టనివ్వకుండా కావలసినవి చేసి పెట్టి తల్లి చాలా అపురూపంగా చూసేది మర్నాడు ప్రసవిస్తుందనగా ముందు రోజు శేఖరుతో అంది శారద "అందరూ నన్నింత బాగా చూసుకుంటున్నారు. నాకుగాని పాప పుడితే పాపని యింత అపురూపంగానూ చూసుకుంటారా?"" నీ కెందుకాసందేహం నాకు ఆడపిల్లే కావాలి సరేనా నిశ్చింతగా నిద్రపో."అంటూ ముంగురులు సవరించాడు శేఖర్.
ఈ సంభాషణ జరిగిన యిరవై నాల్గు గంటల్లో శారదకి ఆడపిల్ల పుట్టింది.తల్లి తన అలవాటులో వున్న డైలాగులు అంటూవుంటే శారద మనసు మెలి పెట్టినట్ట్లయింది. ఎప్పటికి వీళ్ళలో మార్పు కలిగేది నిస్పృహగా నిట్టూర్చింది. నర్సు పాపని తెచ్చిపక్కలో పరుండ పెట్టింది అపురూపంగా రెండు చేతులతో చుట్టిహ్రృదయానికి హత్తుకుంది శారద యీజన్మకీ వరం చాలు అన్నట్ట్లుగా. ఇంతలో జిగ్గుమన్న వెలుగుతో వులిక్కి పడింది.ఎదురుగా శేఖర్ పసిబిడ్డకీ తనకీ కలిపి ఫొటో తీసాడు.ఏమిటీ పని అంటే నాకు ముందే తెలుసు పాపంటె నీకు చాల యిష్టం మోదటిసారిగా మాతృప్రేమని చవి చూస్తున్న మన పాపని, నీకళ్ళలో తొణికిసలాడుతున్న మమకారాన్ని ఫొటోలో బంధించి యీ అపురూపమైన దృశ్యాన్ని మళ్ళీమళ్ళీ చూసుకోవాలని యీ పని చేసాను.ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పిల్లల్ల్ని కంటామంటే ప్రభుత్త్వం వొప్పుకోదు కదా!
వాతావరణంలో యెంతటి వుల్లాసం .పై మాటలు విన్నాక ప్రపంచాన్ని జయించినట్లనిపించింది శారదకి.నాలుగోనాడు యింటికి తీసుకు వెళ్ళారు తల్లినీ బిడ్డనీ. బాలసారె జరిపించి బేంకువుద్యోగుల్ని పిలుద్దామంటే తల్లి గొణిగింది మగ పిల్లాడైతే యివన్నీ చెయ్యొచ్చుగాని ఆడపిల్లకీ ఆడంబరాలెందుకే అంది."అమ్మా!యీ క్షణంనుంచి ఆమాట మర్చిపో యీ బిడ్డ నా జీవన జ్యోతి. ఏ ఆడపిల్ల గురించి న్యూనత చూపించకు". గట్టిగానే మందలించటంతో తల్లి మౌనం వహించింది "బంగారూ నీకేం పేరు పెట్టాలమ్మ" అంది మురిపెంగా ప్రక్కనే కూర్చున్న శేఖర్ యిప్పుడే అన్నావుగా నా జీవన జ్యోతి అని జ్యోతి పేరే పెట్టు. బిడ్డని ప్రేమగా హృదయానికి హత్తుకుంటూ టి వి వైపు చూస్తే అందులో కేర్ ఫర్ ద గర్ల్ చైల్డ్ అంటూ వచ్చింది. అది చూసి మనసారా నవ్వుకున్నారు. -hymavati
Submitted on: Sun Jun 23 2013 05:04:42 GMT-0700 (PDT) Category: Original Language: Telugu Copyright: A Billion Stories (http://www.abillionstories.com) Submit your own work at http://www.abillionstories.com Read submissions at http://abilionstories.wordpress.com Submit a poem, quote, proverb, story, mantra, folklore in your own language at http://www.abillionstories.com/submit
|
|